వేమన శతకం యోగి వేమన ఆటవెలది పద్యాలలో ఆశువుగా చెప్పిన పద్యాలు. వేమన సుమారు 1652 - 1730 మధ్య కాలములో జీవించాడు.
వేమన శతకము|Vemana shatakamu Telugu Book Download
శతక విశిష్టత
వేమన పద్యాలలో ఎక్కువగా లోక నీతులు, సామాజిక చైతన్యంనకు సంబంధించినవి ఉంటాయి. అతను సృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద వేమన కలం ఝళిపించాడు. ఈ పద్యాలకు బహుళ ప్రచారం లభించటానికి కారణాలు చాలా ఉన్నాయి. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకొనేటట్లు వారికి పరిచితమైన భాషలో, స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా, శక్తివంతంగా వ్యక్తీకరించటం, సామాన్యులైన వారిలో తనను ఒకనిగా భావించుకొని నీతి ఉపదేశం చేయటం వేమన నీతులలోని ప్రధాన గుణం. సునిశితమైన హాస్య, వ్యంగ్య, అధిక్షేప చమత్కృతులతో కల్పించి, నవ్వించి ఎదుటివారి లోపాలను, తన లోపాలను, గుర్తెరిగి ఉపదేశించిన రీతిని గమనించేటట్లు చేసే శైలిని ఆయన ప్రదర్శించాడు. సామాన్యాలు మనోజ్ఞాలు అయిన ఉపమాన దృష్టాంతాలతో సూక్తిప్రాయంగా నీతులను బోధించాడు...
పద్య లక్షణము
వేమన పద్యాలన్నీ ఆటవెలది ఛందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోను నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. నాలుగో పాదం "విశ్వదాభిరామ వినుర వేమ" అనే మకుటం.
ఆ॥ వే॥ నిక్కమైన మంచి । నీల మొక్కటి చాలు
దళుకు బెళుకురాళ్ళు | తట్టెడేల ?
చాటుపద్య మిలను చాలదా యొక్కటి ?
విశ్వదాభిరామ వినుర వేమ
టీ॥ విశ్వదాభిరామ = ప్రపంచమును ఆనందింపజేయు వాడా, వేమ=వేమనకవీ!, వినుర = వినుము, నిక్కమైన నిజమై నట్టిది, మంచినీలము=జాతిరత్నము, ఒక్కటి, చాలు=నరి పోవును, తళుకుబెళుకురాళ్ళు= ఆడంబరము గలిగించే ఇమిటే షకా రాళ్లు, తట్టెడేల=గంపనిండుగా ఉన్నను లాభముఏమి ? (లాభము లేదని భావము) చాటుపద్యము=నవరసములుగల పద్యము ఇలను=ప్రపంచమునకు, చాలదా పనికిరాదా ! (పనికి వచ్చునని భావము.)
తా॥ లోకమును సంతనపెట్టునట్టి వేమనకవీ! వినుము. తట్టెడు ఇమిటేషను రాళ్ళకంటె, మంచి విలువగల జాతి రత్నము యొక్కటైనను ఎంతగా ప్రకాశించునో ఆ అవి నీతిలేనిదై మంచిగుణమును బోధించు పద్యము ఒక్కడైనను ప్రపంచమునకు (జనులకు) ఉపయోగించును.