Author: Dr. C. Narayana Reddy
Literature: PURANA ITHIHASA LITERATURE
Language: Telugu
Year: 2014
సౌరభ
"లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు,మం జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబు నై
వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై."
భక్తికి మారుపేరుగా భాగవతాన్ని చెప్పుకుంటారు తెలుగువారు. దానిలో ఉన్న భక్తిగాథలేకాదు-బమ్మెర పోతరాజు కమ్మని కవిత్వం. స్వయంగా భక్తుడై భగవన్నామస్మరణంచేతనే పారవశ్యాన్ని భజించే చిత్తంతో భగవంతుని ప్రేరణతో-భాగవతరచన చేపట్టాడు పోతన్న. కవిత్వం అతనికి కైవల్య సాధనం. కైవల్యం జ్ఞానంవల్లగాని కైవసం కాదు. నిర్గుణమైన బ్రహ్మాన్ని ఉ జ్ఞానంవల్ల పట్టుకోవచ్చు కాని, అది సర్వజనసులభం కాదు. అందరికీ అందుబాటులో ఉండేది భక్తి, భక్తిమార్గం మధురాతిమధురమైనది. సగుణబ్రహ్మను సమాహితంతో సాక్షాత్కరించుకొనటానికి అంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు. 'నీవే తప్ప నిత:పరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా అని అందించే ఏ భక్త చిత్తాని కైనా భగవంతుడు ప్రత్యక్షమౌతాడు; భక్తరక్షణ కళాపారీణుడైన ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు కావచ్చు: మూడడుగుల నేలను యాచించే ముగ్ధవటువు కావచ్చు;ముల్లోకాలను బొజ్జలో ఇముడ్చుకొన్న విశ్వరూపుడు కావచ్చు. భక్తుని భావనాపటిమ ననుసరించి భగవంతుడు బహురూపాలతో అవతరిస్తాడు. శిష్టరక్షణంతోపాటు దుష్టశిక్షణం కూడా చేస్తాడు.
భక్తి అనేది ఒకవిధమైన చిత్తపరిపాకం. ఆకలి అవుతున్న పసిబాల అమ్మపాలకోసం అలమటించినట్లుగానే మానవుని అంతరాత్మ అఖండచిన్న యానందంకోసం ఆరాటపడుతుంది. తియ్యని పాలకై తల్లిపాలిండ్ల కోసం తడిమే పసికూనలాగానే అంతరాత్మ ఆ అనిర్వచనీయానందానుభూతికోసం అన్వేషణ ప్రారంభిస్తుంది. అ అన్వేషణలోనే అంతరాత్మ ఎంతో ఎదుగుతుంది.