స్తవరాజ పంచశతి|Sthavaraja Panchashathi Telugu Book Download
సుమనోంజలి
మహాకవి శిరోమణులు, అభినవ పోతన. అస్మద్గురుదేవులు శ్రీమాన్ డా|| వానమామలై వరదాచార్యులవారు పోతన చరిత్రము మహాకావ్యం, వైశాలిని మహానాటకం వంటి అనేక సత్కృతులు సంతరించి మహావశస్తి గాంచినవారు. వారి దివ్యకావ్యాలలో భక్తిరసామృతభాగీరథిని ప్రవహింపజేసినది ఈ స్తవరాజ పంచశతి. ఆచార్యులవారు జగ మెరిగిన బ్రాహ్మణులు. ఐనా సందర్భోచితంగా సంగ్రహంగా వారి గురించి మనవి చేస్తాను.
ఓరుగల్లు ప్రాంతంలో కవి పండిత ప్రకాండులకు నిలయమైన మడి కొండలో శ్రీమతి నీతాంబ శ్రీమాన్ బక్కయ్యశాస్త్రి గారలనే పుణ్యదంపతులకు శ్రీ పరీధావి శ్రావణ బహుళ ఏకాదశి (క్రీ.శ. 16.8.1912) నాడు వరదాచార్యుల వారు జన్మించిరి. వీరిది ప్రసిద్ధ విద్వద్వంశం. వీరి వంశంలో ఏడు తరాల వరకు వీరి ఇంటిలో నివాసం చేస్తానని సరస్వతీదేవి సెలవిచ్చినట్లు జనశ్రుతి గలదు. వీరి జనకులు బక్కయ్యశాస్త్రి గారు జ్యోతిర్వేదాంతాది శాస్త్రాలలో ప్రాజ్ఞులై మహా పౌరాణికులై 'బ్రతికి బక్కయ్య శాస్త్రి పురాణం వినవలె' నన్న ప్రశస్తి వహిం చినవారు. నలుగురు సోదరులలో వరదాచార్యులవారు కనిష్ఠులు. వీరి పెద్దన్న శ్రీ వేంకటాచార్యులవారు. రెండవ అన్న శ్రీ లక్ష్మణాచార్యులవారు. ఇద్దరూ మహా పండితులు, రచయితలు. వీరి మూడవ అన్న శ్రీ జగన్నాథాచార్యులవారు సుప్రసిద్ధ విద్వత్కవులు. వారి రైతు రామాయణము ప్రశస్త మహాకావ్యం.