పరిచయం
శ్రీరాముడు శాపగ్రస్తురాలై రాయిగా మారిన అహల్యను తన కాలితో తాకగానే తిరిగి అహల్య స్త్రీగా మారినదని ఒక కట్టుకథ ఉంది. హిందువులు శ్రీరాముని దేవుని అవతారమని చెప్పుటకే ఈ కట్టుకథను కల్పించారు. శ్రీరాముని దేవుడంటే తప్పులేదు. కానీ ఈ చరాచర జగత్తునంతా చేసి పోషించి లయంచేసే సృష్టికర్త ధర్త హర్త అనుకుంటే మాత్రం పొరపాటు. శ్రీరాముడు ఏక పత్నీవ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు, వేదవిదుడు. అందువలన ఆయనను దేవుడు - దివ్యగుణములు కలవాడు అంటే దోషమేమీ లేదు. మానవులలోనే విద్వాంసులు, దాన ధర్మములు చేయువారు, వేద విద్యలను నేర్పు ఆచార్యులు, ధర్మబద్ధంగా ప్రజాపాలన చేయు రాజులు మున్నగు వారు కూడా దేవతలనబడతారు. అందువలన శ్రీరాముడొక దేవుడు. సృష్టికర్తయైన పరమేశ్వరుడు మాత్రం కాదు.
మహాభారత యుద్ధానికి పూర్వమే వేద సిద్ధాంతాలు కనుమరుగైన కారణంగా మానవ సమాజంలో అనేక దురాచారాలు ప్రబలం కాసాగాయి. మన ప్రాచీన ఋషులను, మహాత్ములను నిందించటం, అవహేళన చేయటం కూడా అప్పటినుండే ఆరంభమైనది. ఋషులు, ఋషి పత్నులపై నిందలు వేస్తూ మన ప్రాచీన వైదిక సంస్కృతి - సభ్యతలను సర్వనాశనం చేసే ప్రయత్నంలో ఒక భాగమే ఈ అహల్య • శాపం కట్టు కథ. బుద్ధిమంతులు ఆలోచించి ఇటువంటి నిందలను తిరస్కరించాలి.